మహిళలు ఏ బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తించగలరని నిరూపిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె పురుష కలెక్టర్‌తో సమానంగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు.

మొగల్తూరులో నిర్వహించిన 'పేదల సేవలో ప్రజా వేదిక' కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పనితీరును సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, జిల్లా అభివృద్ధి కోసం ఆమె చూపిస్తున్న చొరవ, అంకితభావం, సమర్థత అభినందనీయమన్నారు. మహిళల్లో అపారమైన శక్తి, ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని, వాటిని సరైన విధంగా వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు ప్రజాసేవలో మరింత గొప్ప ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

కలెక్టర్ నాగరాణి పనితీరు మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమర్థత, అంకితభావంతో పనిచేసే మహిళలు ఎలాంటి కీలక బాధ్యతనైనా విజయవంతంగా నిర్వహించగలరని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్ పనితీరును ప్రశంసించడంపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.