విజయనగరం, ఆగస్టు 28: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  • అక్టోబరు 25,26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం
  • ఉదయం 11 గంటలకే సిరిమాను అమ్మవారి ఆలయం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు
  • వీఐపీ దర్శనాల సమయంలోనూ సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు
  • ఈ ఏడాది సుమారు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా — జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

అక్టోబరు 25,26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖలన్నీ తమకు కేటాయించిన విధులను, పరస్పరం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాది కంటే మిన్నగా ఈ ఏడాది పండగను నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. నిర్ణీత సమయానికే సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దీనికోసం ఉదయం 11 గంటలకే సిరిమానును అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొనేలా చూడాలన్నారు. అలాగే తెల్ల ఏనుగు తదితర వాటిని ముందురోజే సిద్దం చేసుకోవాలని సూచించారు.

పారిశుధ్య ఏర్పాట్లు గత ఏడాదికంటే మెరుగ్గా చేయాలన్నారు. ఎల్‌ఈడి స్క్రీన్లు, సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా వీఐపి దర్శనాల సమయాల్లో సైతం సాధారణ భక్తుల దర్శనాలు ఆగకుండా చూడాలని ఆదేశించారు. ఆ మూడు రోజులూ పట్టణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని సూచించారు. గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లూ తలెత్తకూడదని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై త్వరలో మరో సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని తెలిపారు.

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి పండుగకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా బారికేడింగ్ అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. రధాలను ముందుగా సిద్దం చేయాలని సూచించారు. అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా సిరిమానోత్సవాన్ని వెలుతురు ఉండగానే ముగించేలా, నిర్ణీత సమయానికే ప్రారంభించాలని కోరారు.