విజయనగరం, అక్టోబర్ 4 (ఎక్స్ప్రెస్ టుడే): బీసీలకు రాజకీయ అధికారానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తన కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తనలాంటి యువకుడిని మంత్రిని చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి గానీ, వైసీపీకి గానీ లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ అనేక పదవులను అందించిందని గుర్తుచేశారు.
బొత్స సత్యనారాయణ అధికారంలో ఉండగా ఏమి చేశారని ప్రశ్నించిన మంత్రి, ఇప్పుడు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు.
బీసీలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీసీల హక్కుల కోసం సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాది ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. బీసీలలోని అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రలోనే తన తాత పైడితల్లి నాయుడు, ఎర్రన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు వంటి బీసీ నేతలను గుర్తించి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని గమనించాలని ఆయన అన్నారు. బీసీల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వేషన్లు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు.
