విజయనగరం, సెప్టెంబర్ 25: ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో అకాల వర్షాలకు నష్టం వాటిల్లకుండా విధులు నిర్వహించిన ఉత్తరాంధ్ర అధికారుల సేవలు భేష్ అని శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

  • గత నాలుగు రోజులుగా అధిక వర్షపాతం, భారీ ఈదురు గాలుల నడుమ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రాణ నష్టం నివారణ
  • కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎంహెచ్‌ఓలు, కమిషనర్ల ఆధ్వర్యంలో కిందిస్థాయి సిబ్బంది సమన్వయం సఫలం
  • ప్రజలకు అవగాహన కల్పించి తుఫాను పట్ల అప్రమత్తం చేయడంతో మానవ, పశు ప్రాణ నష్టం నివారణ
  • హెచ్చరికలు, అవగాహన కల్పనలో మీడియా, కూటమి పార్టీ నాయకుల పాత్ర ప్రశంసనీయమని వ్యాఖ్య
  • ఎగువ కొండ ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా వస్తున్నందున మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచన

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే అధిక వర్షపాతం నమోదవడంతోపాటు భారీ ఈదురు గాలులు వీస్తున్న సందర్భంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసిన కారణంగానే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలను పాటిస్తూ తుఫాను ప్రభావాన్ని ప్రజలకు నష్టం జరగకుండా ఉండేలా ఉత్తరాంధ్ర జిల్లాలలోని కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎంహెచ్‌ఓలు, కమిషనర్ల ఆధ్వర్యంలో కిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేయటంలో సఫలీకృతులయ్యారని తెలిపారు.

కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి తుఫాను పట్ల అప్రమత్తం చేయడంతోనే మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగామని మంత్రి వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో తుఫాను కారణంగా సంభవించే నష్టాలను, ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేయడంలో కూటమి పార్టీ నాయకుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీచేసి, జరగబోయే పరిణామాలను విస్తృతంగా తెలియచేసి, చైతన్యపరచటంలో మీడియా ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కొండలు, వాగులు, గడ్డలు ఎక్కువగా ఉంటాయన్న విషయం ఆ ప్రాంత అధికారులకు, ప్రజలకు తెలిసిన విషయమేనని, తుఫాను ప్రభావం తగ్గిననూ ఎగువ కొండ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు ఇంకా వస్తూనే ఉంది కాబట్టి మరో రెండు రోజులపాటు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే తుఫాను నష్ట నివారణ కోసం వరద ముంపు ప్రాంతాలకు పరిశీలనకు వెళుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది జాగ్రత్త చర్యలు పాటించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.