జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (GTI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో 700 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్ విభాగంలో 300 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఏదైనా ట్రేడ్, డిప్లొమా లేదా బీటెక్ (మెకానికల్) విద్యార్హత కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపారు.

ఎంపికైన వారికి నెలకు రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనం అందించడంతో పాటు హాజరు బోనస్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, వర్క్‌స్టేషన్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు కల్పించనున్నట్లు వివరించారు. అదేవిధంగా ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో పాటు EPF, ESI, బోనస్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు.

శిక్షణ అనంతరం ఆసక్తి మరియు ప్రతిభ కలిగిన వారికి సంస్థకు చెందిన విదేశీ గ్రూప్ కంపెనీ సెర్బియాలో ఒక సంవత్సరం పాటు పనిచేసే అవకాశం కూడా లభించవచ్చని తెలిపారు.

జిల్లా యువతకు అందుబాటులోకి వచ్చిన ఈ భారీ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత తేదీల్లో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరై తమ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

మరిన్ని వివరాలకు 90305476667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.