ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో లోటు వర్షపాతం నెలకొందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు కోరారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, పంటలకు తప్పనిసరిగా బీమా సదుపాయం పొందాలని ఆయన సూచించారు.

విజయనగరం, ఆగస్టు 26: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేడీ మాట్లాడుతూ, ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించిన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, పంటల బీమా మరియు ఎరువుల లభ్యత తదితర అంశాలను వివరించారు.

37.22 శాతం లోటు వర్షపాతం

ఎలినినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సాధారణం కంటే 37.22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సంయుక్త సంచాలకులు తెలిపారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 123.5 మి.మీ కాగా 96.3 మి.మీ (-22.02% లోటు), జూలైలో సాధారణ వర్షపాతం 170.8 మి.మీ కాగా తీవ్ర లోటుతో 58.1 మి.మీ (-65.98% లోటు) మాత్రమే కురిసింది. ఆగస్టులో ప్రస్తుత తేదీ వరకు సాధారణ వర్షపాతం 161.6 మి.మీ కాగా, పరిస్థితి మెరుగుపడి 131.8 మి.మీ (-18.44% లోటు) నమోదైంది. నైరుతి రుతుపవనాల మొత్తం విషయానికి వస్తే, జిల్లాలో సాధారణంగా కురవాల్సిన 455.9 మి.మీకి గాను ప్రస్తుతం 286.2 మి.మీ మాత్రమే నమోదై, మొత్తం 37.22 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం

తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ, సాధారణ సాగు విస్తీర్ణం 1,23,608 హెక్టార్లలో 59,337 హెక్టార్లు (63%) సాగైంది. వరి సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు కాగా ప్రస్తుతం 45,056 హెక్టార్లలో (62%) నాట్లు పడ్డాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 11,318 హెక్టార్లలో 7,746 హెక్టార్లలో (80%), నువ్వులు 5,252 హెక్టార్లలో 2,416 హెక్టార్లలో (46%) సాగయ్యాయి. పత్తి సాధారణ విస్తీర్ణం 2,204 హెక్టార్లు కాగా అంచనాలను మించి 2,236 హెక్టార్లలో (137%) అత్యధికంగా సాగైంది. చెరకు సాధారణ విస్తీర్ణం 3,813 హెక్టార్లలో 1,606 హెక్టార్లలో (42%) సాగు చేయబడింది. ఎలినినో దృష్ట్యా 26,665 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళిక రూపొందించామని, ఇందులో భాగంగా 6,245 క్వింటాళ్ల వివిధ విత్తనాల సరఫరాకు ఇండెంట్ పెట్టినట్టు తెలిపారు. రైతులకు మంచి గిట్టుబాటునిచ్చే రాగి, అలసంద తదితర పంటలపై దృష్టి సారించాలని కోరారు.

పంటలను బీమా చేయించాలి

ఈ పరిస్థితుల్లో రైతుల పంటలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పంటల బీమా చాలా అవసరమని జేడీ పేర్కొన్నారు. రుణాలు పొందే రైతులు వరి, మొక్కజొన్న పంటలకు బీమా పొందేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని, వెంటనే బ్యాంకులను సంప్రదించాలని సూచించారు. వరి మరియు మొక్కజొన్న సాగైన 52,802 హెక్టార్లలో ఇప్పటివరకు 35,096 హెక్టార్లకు (66.47%) బీమా వర్తింపజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 60,273 మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. రైతుల తరఫున రూ.172.71 లక్షల ప్రీమియం మొత్తాన్ని చెల్లించగా, బీమా చేసిన పంటకు గాను మొత్తం రూ.34,544.35 లక్షల కవరేజీ కల్పించినట్టు తెలిపారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని మిగిలిన రైతులు కూడా తమ పంటలకు ఫసల్ బీమా చేయించుకుని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందాలని ఆయన కోరారు.

సంతృప్తికరంగా ఎరువుల సరఫరా

జిల్లాలో ఎరువుల సరఫరా, లభ్యత సంతృప్తికరంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ పంటకాలంలో 33,677 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, జిల్లాకు ఇప్పటివరకు 27,658 టన్నులు సరఫరా జరిగింది. ఇందులో 16,477 టన్నులు రైతులకు సరఫరా జరపగా, 11,181 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. మొదటి దఫా కోసం 12,251 టన్నుల యూరియా అవసరం ఉండగా 11,997 (99%) టన్నుల సరఫరా జరిగింది, రెండో దఫా కోసం 8,999 టన్నుల అవసరం ఉండగా 4,808 (36%) టన్నుల సరఫరా జరిగింది. అదేవిధంగా డీఏపీ ఖరీఫ్ పంటకాలానికి 11,849 టన్నులు అవసరం ఉండగా, ఇప్పటివరకు 9,562 టన్నులు జిల్లాకు చేరింది. ఇందులో 5,571 టన్నులు రైతులకు సరఫరా జరగగా, ప్రస్తుతం 3,991 టన్నులు అందుబాటులో ఉందని, ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని జేడీ విటి రామారావు స్పష్టం చేశారు.