గజపతినగరం, సెప్టెంబర్ 02: మండలంలోని మధుపాడ గ్రామంలో పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి భూసేకరణలో తలెత్తే సమస్యలపై ఆరా తీశారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరుపల్లిలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ తనిఖీ

భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా మరుపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జెసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తిస్తున్న తీరును పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. రీసర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన రైతులకు స్పష్టతనివ్వాలని, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సిద్ధం కావాలని సూచించారు.

రేషన్ డిపో ఆకస్మిక తనిఖీ మరియు లబ్ధిదారులతో ముఖాముఖి

మండల కేంద్రంలోని 14వ నంబర్ రేషన్ డిపోను జెసి సేధు మాధవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను నిశితంగా పరిశీలించడంతో పాటు సరుకుల పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సరుకులు సక్రమంగా, నాణ్యతతో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే పై ఆరా తీశారు.

ఈ పర్యటనలో ఎస్డీసీ వెంకటరెడ్డి, తహసీల్దార్ కె. భరత్ కుమార్, డి.టి.లు, సర్వేయర్లు పాల్గొన్నారు.