విజయనగరం, సెప్టెంబర్ 21: పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించబడేటట్లు చూడటంతో పాటు, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ సర్వే మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విభాగం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ఆలస్యంగా పరిష్కరించిన ఫిర్యాదులపై రివ్యూ నిర్వహించి కారణాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రీ-ఆడిట్, ఆడిట్ దశల్లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, రీ-ఓపెనింగ్స్ రాకుండా నివారించే దిశగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సానుకూల అభిప్రాయంలో జిల్లా ర్యాంక్ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ వారంలో అందించిన సేవల గురించి ముందుగా ప్రజలకు వివరించాలని, వారు సానుకూలంగా స్పందిస్తేనే ర్యాంక్ మెరుగవుతుందని తెలిపారు. అందిస్తున్న సేవలు సక్రమంగా ఉండి ప్రజలు సంతృప్తి చెందితే వేరేగా చెప్పాల్సిన అవసరం లేకుండానే సానుకూలత పెరుగుతుందని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతి శాఖ మంచి ర్యాంక్ సాధించాలని, ఇప్పటికే మంచి ర్యాంక్ ఉన్నవారు దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు.