విజయనగరం, సెప్టెంబర్ 29: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్ణీత గడువుకంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేశారని, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ యంత్రాంగాన్ని అభినందించారు.
ఆయన మంగళవారం జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా కలెక్టరేట్లో ఇఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన వివిధ దశలను పిపిటి ద్వారా వివరించారు. జిల్లాలో ఈపి రేషియో 643గా ఉందని, జెండర్ రేషియోను విజయనగరం, రాజాం నియోజకవర్గంలో పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
జిల్లాలో మ్యాపింగ్ కాని లక్షా 93 వేల 735 మందికి నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరిలో కేవలం 3012 మంది మాత్రమే వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించామని, మిగిలిన లక్షా 90 వేల 724 మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
రోల్ అబ్జర్వర్ రోణంకి మాట్లాడుతూ, సమగ్ర సవరణ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ప్రశంసించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువు కంటే చాలా ముందుగానే ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తి అయ్యిందని చెప్పారు. ముఖ్యంగా స్వీప్ కార్యక్రమాన్ని, ఈ కొద్ది రోజుల్లోనే సుమారు 14 వేల మంది యువ ఓటర్లను చేర్చడాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
సర్ ప్రక్రియ ముగిసిన తరువాత, ఎప్పటిలాగే పాత ఫారం 6 ధరఖాస్తుల ద్వారానే కొత్త ఓటర్ల నమోదు జరుగుతుందని తెలిపారు. ఎక్కువ ఓట్లు చేరిక, ఎక్కువ తొలగింపులు జరిగిన చోట కనీసం 20 పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓలు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని అబ్జర్వర్ గోపాలకృష్ణ సూచించారు.
