ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సత్వరంగా, పారదర్శకంగా అందించి మెరుగైన ర్యాంకులను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ర్యాంకులు, ప్రజలకు అందుతున్న సేవలు, వాటిపై ప్రజల సంతృప్తి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రభుత్వంపై ప్రజల్లో మరింత సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరింత మెరుగైన ర్యాంకులను సాధించాలని ఆదేశించారు.
69.93 శాతంగా పాజిటివ్ పర్సెప్షన్ స్కోర్
పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ నివేదిక ప్రకారం జిల్లాలో ప్రస్తుత వారానికి సంబంధించిన ఓవరాల్ పాజిటివ్ స్కోర్ 69.93 శాతంగా నమోదైన నేపథ్యంలో, తక్కువ సానుకూలత నమోదవుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు నేరుగా సంబంధించిన సేవల్లో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ మరింత పెంచాలని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపడం ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. త్వరలో కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయని తెలిపారు. విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని కోరారు. ఈ సమీక్షలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్లైన్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
