విజయనగరం, సెప్టెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “పేదల సేవలో 2.0” కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తన ఛాంబర్ నుండి హాజరయ్యారు.
పేదల సేవలో 2.0 కార్యక్రమ లక్ష్యాలు, మార్గదర్శకాలు, అమలు విధానంపై ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఏ పథకానికైనా అర్హత ఉండి ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కవర్ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులను తప్పనిసరిగా నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించాలని తెలిపారు.
ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం, లైన్ డిపార్ట్మెంట్లు, సచివాలయ సిబ్బంది, ఎస్జీఎస్డబ్ల్యూ, సెర్ప్, మెప్మా తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యక్రమంలో స్పష్టమైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
