విజయనగరం, సెప్టెంబర్ 25: జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పిల్లలచేత ఆల్బెండజోల్ మాత్రలను స్వయంగా మ్రింగించారు.
- 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు
- అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం కార్యక్రమం నిర్వహణ
- జిల్లాలో 3,16,867 మంది బాలబాలికల గుర్తింపు; 2,499 అంగన్వాడీ కేంద్రాలు, 2,380 పాఠశాలలు భాగస్వామ్యం
- కార్యక్రమం కోసం 3,68,000 మాత్రలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడి
- మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్ 5న మాప్-అప్ డే సందర్భంగా పంపిణీ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. వీటి నివారణకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు.
డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి మాట్లాడుతూ, ఆల్బెండజోల్ మాత్రల వినియోగం వల్ల రక్తహీనతను నివారించడంతో పాటు పోషకాల గ్రహణశక్తి మెరుగుపడుతుందని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు గల 42,896 మంది బాలబాలికలకు అర మాత్ర, 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 25,412 మంది బాలబాలికలకు ఒక పూర్తి మాత్ర అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 2,48,559 మంది విద్యార్థులకు, అలాగే టెక్నికల్, వొకేషనల్, నర్సింగ్ విద్యార్థులకు కూడా మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
నులిపురుగుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు. గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన మంచినీటిని తాగడం, ఆహారాన్ని ఎప్పుడూ కప్పి ఉంచడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా ఉండడం, బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు ధరించడం, ఆహారం తినడానికి ముందు, తిన్న తరువాత, మల విసర్జన అనంతరం చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు.
సెప్టెంబర్ 25న నిర్వహించే కార్యక్రమంలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్ 5న మాప్-అప్ డే సందర్భంగా మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో మాణిక్యం నాయుడు, డి-వార్మింగ్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘువంశి, పాఠశాల హెచ్ఎం కాంచన, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
