విశాఖపట్నం, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) విశాఖ జిల్లా శాఖ నిర్వహించిన సింహాచలం ట్రెక్కింగ్ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సాహసీకులు ప్రకృతి ఒడిలో పులకరించిపోయారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా శాఖ సింహాచలం కొత్త గోశాల నుంచి జీలుగులోవ మీదుగా సింహాచలం కొండపైకి ట్రెక్కింగ్ ఏర్పాటు చేసింది. ఐదు కిలోమీటర్ల ఈ సాహసం అందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఔషధ మొక్కలు, ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాల నడుమ ట్రెక్కింగ్ సాగింది. కొండపై ఉన్న వనదేవతను, శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువైన సింహాచలం ఆలయ శిఖరాన్ని ట్రెక్కర్లు దర్శించుకున్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి 126 మంది ప్రకృతి ప్రేమికులు ఇందులో పాల్గొన్నారు. ట్రెక్కర్లు కొండపై విత్తన బంతులు విసిరి ప్రకృతి ప్రేమను చాటుకున్నారు.

వైహెచ్‌ఏఐ విశాఖపట్నం జిల్లా శాఖ అధ్యక్షుడు పి. నగేష్, ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ యాదవ్, చైర్మన్ ఎండీ ఇబ్రహీం, గౌరవ కార్యదర్శి షేక్ సైదా, కోశాధికారి అనిల్ కుమార్, సభ్యులు చిన్నారావు, ఉమ్మిడి భాస్కరరావు, పూర్వ చైర్మన్ కేవీ రాజు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ, సేవ్ నేచర్ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.