కడప, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో పెట్టుబడులకు ప్రతిపాదన — సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశం: మంత్రి టీజీ భరత్
విశాఖపట్నం, అక్టోబర్ 6 (ఎక్స్ప్రెస్ టుడే): ఆంధ్రప్రదేశ్లో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విశాఖపట్నంలో మంత్రిని శ్రీ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల విస్తరణపై చర్చించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో రూ.6,700 కోట్ల పెట్టుబడులతో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రికి తెలిపారు. ముఖ్యంగా కడప, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే దాదాపు 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.
శ్రీ సిమెంట్స్ ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో వైస్ చైర్మన్ ప్రశాంత్ బాబు, ప్రెసిడెంట్ కార్పొరేట్ అఫైర్స్ గౌరవ్ జైన్ ఉన్నారు.
