విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న డీ-వార్మింగ్ డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్రలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

జిల్లాలో డీ-వార్మింగ్ డే కార్యక్రమం అమలుపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 5,74,496 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించాలని ఆదేశించారు. పిల్లలు మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి చిన్నారికి మాత్ర అందేలా విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఒక వేళ 25న తీసుకోలేని పిల్లలకు అక్టోబర్ 5న నిర్వహించే మాప్‌అప్ రౌండ్‌లో తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.