విశాఖపట్నం, అక్టోబర్ 12 (ఎక్స్ప్రెస్ టుడే): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఆవశ్యకతను ప్రతి అధికారి తెలుసుకోవడంతో పాటు, ఈ చట్టం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. పారదర్శక పాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలకమని పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం-2005 వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ అధికారి చట్టంలోని నిబంధనలు, తమ బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని చట్ట పరిధిలో సకాలంలో అందిస్తూ, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు.
ఆర్టీఐ దరఖాస్తులను అందుకున్న వెంటనే పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, సంబంధిత కార్యాలయానికి చెందని దరఖాస్తులను చట్టంలోని సెక్షన్ 6(3) ప్రకారం నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖకు బదిలీ చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం వెల్లడించాల్సిన వివరాలను, అధికారుల పేర్లు, సంప్రదింపు నంబర్లు, వారు నిర్వహించే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కార్యాలయాల్లో, ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టంపై అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు, ప్రజలకు కూడా ఈ చట్టం ద్వారా సమాచారం పొందే విధానం, దరఖాస్తు ప్రక్రియ, తమ హక్కుల గురించి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సమాచార హక్కు చట్టంలోని సాంకేతిక, న్యాయపరమైన అంశాలను, ఇతర నిబంధనలను కలెక్టరేట్ ఏవో బీవీ రాణి కలెక్టర్ సమక్షంలో వివరించారు. వారోత్సవాల ప్రాధాన్యతను తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు.
