విశాఖపట్నం, సెప్టెంబర్ 25: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అత్యవసర వైద్యం అందేలా చూడాలని సూచించారు.

  • కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహణ
  • జాతీయ రహదారుల సంస్థ వద్ద అంబులెన్స్‌ల నిర్వహణ, వినియోగ వివరాలు తదుపరి సమావేశానికి తీసుకురావాలని ఆదేశం
  • నెలవారీగా జరిగిన ప్రమాదాలు, మరణాలపై ఆడిట్ నివేదికలు రూపొందించాలని పోలీసులకు సూచన
  • ఐరాడ్ యాప్‌లో బాధితుల డేటా అప్‌లోడ్ చేయాలని, బ్లాక్ స్పాట్‌లు తగ్గించి సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచన
  • నగరంలో పనిచేయని 11 సిగ్నల్స్‌పై జీవీఎంసీని ప్రశ్నించిన కలెక్టర్; 6 పనులు వేగంగా జరుగుతున్నట్లు వివరణ

కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాల నివారణ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, గత సమావేశపు అంశాలపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జాతీయ రహదారుల సంస్థ వద్ద ఎన్ని అంబులెన్స్‌లు ఉన్నాయి, వాటిని ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన కలెక్టర్ — వీటి ద్వారా ఎంతమందిని ఆసుపత్రులకు తరలించారు, ఎంతమందికి చికిత్సలు అందించారు తదితర వివరాలను తదుపరి సమావేశానికి తీసుకురావాలని ఆదేశించారు. 108 వాహనాల సమన్వయాధికారి వీరితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నెలవారీగా జరిగిన ప్రమాదాలు, మరణాలు ఆడిట్ చేయాలని, ఎన్ని ద్విచక్ర వాహనాల, ఎన్ని 4 చక్రాల వాహనాల ప్రమాదాలు సంభవించాయనే వివరాలను, మరణాలకు గల కారణాలను నివేదికలో పొందుపరచి వచ్చే సమావేశానికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఐరాడ్ యాప్‌లో బాధితుల డేటా అప్‌లోడ్ చేయాలని, ఒకసారి ప్రమాదం జరిగిన చోట మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్ తగ్గించాలని, సీసీ టీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిపాదించిన పనులను జీవీఎంసీ, వీఎంఆర్డీఏ తమ పరిధిలోని పనులు వేగంగా పూర్తి చేయాలని, ఆర్థికేతర పనులను ముందుగా చేపట్టాలని తెలిపారు.

నగరంలో 11 చోట్ల సిగ్నల్స్ పనిచేయడం లేదని గత సమావేశంలో చర్చ జరిగినట్లు, దానిపై జీవీఎంసీ తీసుకున్న చర్యలపై ఎస్‌ఈని కలెక్టర్ ప్రశ్నించారు. 6 సిగ్నల్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తవుతాయని ఎస్‌ఈ తెలిపారు. ఆనందపురం పూల మార్కెట్‌ను అక్కడి నుంచి మార్చడానికి భీమిలి ఆర్డీవో, వీఎంఆర్డీఏ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ అధిక వేగం ప్రమాదాలకు కారణమవుతుందని, బస్సులను, డ్రైవర్లను తనిఖీలు చేయాలని సూచించారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న స్పాట్‌లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి విజయ్ ప్రకాశ్, ఎంవీఐలు, పోలీసు అధికారులు, జీవీఎంసీ, ఎన్‌హెచ్ఏఐ, ఆర్&బీ, ఏపీఎస్‌ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.