విశాఖపట్నం, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పదోన్నతి పొంది, రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ కె. రాంబాబుకు శనివారం ఆంధ్రా మెడికల్ కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు.
ఆంధ్రా మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి హాజరై డాక్టర్ రాంబాబును శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె. రాంబాబు మాట్లాడుతూ, "నాకు ఈ పదోన్నతి రావడం వెనుక నా ఒక్కడి కృషి కాదు, నన్ను తీర్చిదిద్దిన ఆంధ్రా మెడికల్ కళాశాల, నా గురువులు, నా విద్యార్థులు, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. 26 ఏళ్లుగా ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్‌గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఐడీహెచ్ సూపరింటెండెంట్‌గా, విమ్స్ డైరెక్టర్‌గా, రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా, జీవన్‌దాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా 5 ఏళ్లు పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రతి పదవి నాకు ఒక పాఠం నేర్పింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదని తెలుసుకున్నాను.
ఇప్పుడు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నాకు మరో పెద్ద బాధ్యత అప్పగించారు. గోదావరి జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్యార్థులకు మెరుగైన విద్య, ఆసుపత్రి అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తాను. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని భావోద్వేగంగా తెలిపారు.
అనంతరం రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా, విమ్స్ డైరెక్టర్‌గా, జీవన్‌దాన్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా ఆయన అందించిన విశిష్ట సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
