గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన తొలి 'ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026' పోటీల్లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి సమష్టిగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1,900 మంది పోలీసు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు (197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాయి.
ఈ వివరాలను విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మరియు విశాఖ రేంజ్ జిల్లాల ఎస్పీలు బుధవారం విశాఖపట్నం రేంజ్ ఐజీ కార్యాలయంలో సంయుక్తంగా వెల్లడించారు.
- విశాఖపట్నం సిటీ: 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలతో మొత్తం 109 పతకాలతో అగ్రస్థానం
- విజయనగరం జిల్లా: 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు
- అనకాపల్లి జిల్లా: 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 70 పతకాలు
- శ్రీకాకుళం జిల్లా: 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో 33 పతకాలు
- పార్వతీపురం మన్యం జిల్లా: 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలతో 32 పతకాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా: 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలతో 20 పతకాలు
అనకాపల్లి పోలీసుల ప్రత్యేక ప్రతిభ
అనకాపల్లి జిల్లా పోలీసు క్రీడాకారులు రికార్డు స్థాయిలో 70 పతకాలు (44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు) సాధించి రేంజ్ విజయానికి బలమైన వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్‌ఐ ఎల్. మన్మధరావు విశాఖపట్నం రేంజ్ టీమ్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ ఫుట్‌బాల్, కో-కో, క్రికెట్ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు సాధించారు.
మహిళా సిబ్బంది అసమాన ప్రతిభ
డబ్ల్యూపీసీ వి. విజయ (నెం.2609) 4x400 మీ., 5000 మీ., 1500 మీ., 800 మీ. పరుగు పందేలు, కో-కో విభాగాల్లో ఏకంగా 5 స్వర్ణాలు సాధించారు. డబ్ల్యూపీసీ కె. విజయలక్ష్మి (నెం.2992) 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం సాధించగా, డబ్ల్యూపీసీ ఎల్. పావని కుమారి (నెం.2993) 7 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు దక్కించుకున్నారు. డబ్ల్యూపీసీ ఎం. నిర్మల (నెం.1816) యోగా, హ్యాండ్‌బాల్‌లో 2 స్వర్ణాలు, 3 రజతాలు సాధించగా, డబ్ల్యూపీసీ డి. రంజని (నెం.3593) వాలీబాల్, కబడ్డీలో 2 స్వర్ణాలు సాధించారు. డబ్ల్యూహెచ్‌సీ డి. లలిత (నెం.83) వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణంతో పాటు పలు విభాగాల్లో పతకాలు సాధించారు.
పురుషుల విభాగంలోనూ మెరుపులు
హెడ్ కానిస్టేబుల్ జి. మధుబాబు (నెం.1465) స్విమ్మింగ్‌లో 3 స్వర్ణాలు, 1 రజతం సాధించారు. పీసీ జి. శ్రీనివాసరావు (నెం.1958) బాడీబిల్డింగ్‌లో 2 స్వర్ణాలు గెలుచుకోగా, వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్ జట్లలో పలువురు కానిస్టేబుళ్లు స్వర్ణ పతకాలు అందించారు.
క్రీడాస్ఫూర్తే పోలీసులకు నిజమైన బలం: ఐజీ గోపినాథ్ జట్టి
ఈ సందర్భంగా రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి మాట్లాడుతూ, 'గెలుపు స్ఫూర్తినిస్తే, ఓటమి కొత్త అనుభవాన్ని నేర్పుతుంది. రెండింటినీ సమానంగా స్వీకరించడమే నిజమైన క్రీడాస్ఫూర్తి. పతకాలు రాని వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో సాధన చేయాలి. పోలీసుశాఖలో హోదాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా ఒకే కుటుంబం' అని అన్నారు. మారుతున్న నేరాల శైలిని అడ్డుకోవడానికి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం అవసరమని, ప్రతి ఒక్కరూ క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. మహిళా సిబ్బంది మైదానంలో చూపిన అంకితభావం, ప్రతిభను ఆయన అభినందించారు. త్వరలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌లోనూ సత్తా చాటి ఆంధ్రప్రదేశ్‌కు, విశాఖ రేంజ్‌కు ఖ్యాతి తేవాలని ఆకాంక్షించారు.
పతక విజేతలకు అభినందనలు
ఈ కార్యక్రమంలో పతకాలు సాధించిన క్రీడాకారులు, సిబ్బందిని ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
