విజయవాడ, సెప్టెంబర్ 26: శ్రీకాళహస్తి కలంకారీ, బొబ్బిలి వీణ, దుర్గి రాతి శిల్పం, కొబ్బరి చిప్పలు, తాటాకు, వెదురు తదితర సంప్రదాయ హస్తకళలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ విస్తృత కార్యక్రమాలను చేపడుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ, డిజైన్ అభివృద్ధి, ఆధునిక పనిముట్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనుంది.
- కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ కమిషనర్ (హ్యాండీక్రాఫ్ట్స్) నుంచి 24 కార్యక్రమాలకు సుమారు రూ.1.55 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు
- రాష్ట్రవ్యాప్తంగా 840 మంది కళాకారులకు ప్రయోజనం
- గురు శిష్య శిక్షణ కార్యక్రమంలో కొబ్బరి చిప్పల కళాకృతులు, చెక్క బ్లాక్‌లు, శ్రీకాళహస్తి కలంకారీ, తాటాకు కళ, దుర్గి రాతి శిల్పం తదితర కళల్లో శిక్షణ
- రాజమహేంద్రవరం, విజయవాడ, విష్ణువాసం, కాకినాడ, గుంటూరు లేపాక్షి కేంద్రాల ద్వారా కార్యక్రమాల నిర్వహణ
- అరటి పీచు, దుర్గి రాతి శిల్పం, కేన్ అండ్ బాంబూ, చెక్క పనులు, లక్కపని చేసే 200 మంది కళాకారులకు ఆధునిక టూల్కిట్ల పంపిణీ
లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ కళల్లో నైపుణ్యం కలిగిన కళాకారులకు ఆధునిక డిజైన్లు, సాంకేతికత, మెరుగైన పనిముట్లపై శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెట్ అవకాశాలను పెంచడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన డెవలప్మెంట్ కమిషనర్ (హ్యాండీక్రాఫ్ట్స్) 24 కార్యక్రమాలకు సుమారు రూ.1.55 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 840 మంది కళాకారులకు ప్రయోజనం కలగనుంది.
గురు శిష్య శిక్షణ కార్యక్రమంలో కొబ్బరి చిప్పలతో కళాకృతుల తయారీ, చెక్క బ్లాక్‌ల తయారీ, శ్రీకాళహస్తి కలంకారీ, తాటాకు కళ, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్, దుర్గి రాతి శిల్పం, అగరబత్తుల తయారీ వంటి సంప్రదాయ కళల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో కార్యక్రమంలో 30 మంది కళాకారులు పాల్గొంటారు. రాజమహేంద్రవరం, విజయవాడ, విష్ణువాసం, కాకినాడ, గుంటూరులోని లేపాక్షి కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
కళాకారులకు అవసరమైన పనిముట్లను ఆధునీకరించడంపైనా దృష్టి సారించారు. మెరుగైన పనిముట్ల పంపిణీ కార్యక్రమం కింద అరటి పీచు, దుర్గి రాతి శిల్పం, కేన్ అండ్ బాంబూ, చెక్క పనులు, లక్కపని చేసే 200 మంది కళాకారులకు ఆధునిక టూల్కిట్లను అందించనున్నారు. డిసెంబర్లో అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
