రాష్ట్రంలోని 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం లఖ్నవూలో 'లోక్మాతా అహల్యాబాయి మాతృశక్తి యాత్ర' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బస్సులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
మహిళల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా మార్చడం, వారి స్వావలంబనను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రారంభోత్సవంలో సీఎం యోగి పేర్కొన్నారు.
"జీవితాంతం కుటుంబం, సమాజం కోసం శ్రమించిన మాతృశక్తి ప్రయాణాన్ని సులభతరం, గౌరవప్రదం చేయాలన్న మా సంకల్పాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సాకారం చేస్తోంది" అని సీఎం యోగి తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తల్లులు, సోదరీమణులు, కుమార్తెలతో పాటు వారి వెంట వచ్చే ఒక వ్యక్తికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని సీఎం తెలిపారు.
