గోమతి నది పొంగిపొర్లడంతో వరద ముంపునకు గురైన లఖ్‌నవూ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం వైమానిక సర్వే నిర్వహించారు.

ఫైజుల్లాగంజ్ నుంచి నైమిష్ వరకు గాలిలో సర్వే చేసిన ఆయన, బక్షీ కా తాలాబ్ సహా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలిశారు, సహాయ సామగ్రి పంపిణీ చేశారు. పిలీభీత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కొన్ని రోజుల తర్వాత గోమతి నీటిమట్టం పెరిగిందని చెప్పారు.

ఫైజుల్లాగంజ్ నుంచి నైమిష్ వరకు గోమతి తీరాన్ని సర్వే చేసి, పదేపదే వచ్చే వరదలను అరికట్టేందుకు కట్టల నిర్మాణ ప్రతిపాదన సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. అక్టోబరులో వరద పరిస్థితి ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, గోమతి కట్ట నిర్మిస్తే వరద నష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు.

నీరు నిలిచిన ప్రాంతాల్లో పంపింగ్ సెట్ల ద్వారా నీటిని నదిలోకి మళ్లించాలని సూచించారు. సహాయ, రక్షణ చర్యలకు యంత్రాంగానికి తగినన్ని నిధులు అందించామని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.