హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రపంచం నేర్చుకోవడానికి, ఆవిష్కరణలకు, పెట్టుబడులకు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ పెట్టుబడులు, వ్యాపారానికే కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ, ఆవిష్కరణలు, భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలోచనలకు కూడా ప్రపంచానికి గమ్యస్థానంగా మారుతోందని ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు.
గురువారం (సెప్టెంబర్ 17) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో యునైటెడ్ కింగ్డమ్లోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు, విశ్వవిద్యాలయాల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, పరిశ్రమ–విద్యాసంస్థల సహకారంలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ఉద్దేశం.
సమావేశంలో మూసీ ప్రాజెక్టు తొలి దశ పనులపై చర్చ జరిగింది. మూసీ, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు సాగే ఈ దశ పనులు, 'నైట్ ఎకానమీ' ప్రోత్సాహం గురించి ఆయన వివరించారు. 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నెట్-జీరో నగరంగా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
