శంషాబాద్, సెప్టెంబర్ 19: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల గ్రామం వద్ద జాతీయ రహదారి 44పై శుక్రవారం రాత్రి (శనివారం తెల్లవారుజామున) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న వారి ఇన్నోవా కారు కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. కారు తునాతునకలైంది; నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాత్రావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వాస్రామ్ (45)లుగా గుర్తించారు. వీరు మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండా నుంచి శంషాబాద్ వెళుతున్నారు. లింబ్యా, మాన్‌సింగ్, వాస్రామ్ వ్యాపారం చేస్తుండగా, జమున గృహిణి.

కారు డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడటంతో శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.