కొడంగల్, నవంబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): కొడంగల్‌లో ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తరువాత పాలమూరుకు వివిధ అవకాశాలు దక్కినా జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్లలేదు. తెలంగాణ వస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఆనాడు విఠల్ రావును కాదని 2009లో ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంటుకు పంపారు.’
‘కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తవుతాయని అంతా అనుకున్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరేది. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినా పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్నా లెక్కచేయక ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టించారు.’
పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చారు
‘కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలింది వాళ్ల హయాంలోనే. కాళేశ్వరం అవకతవకలపై మీరు ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు మోకరిల్లి సీబీఐ విచారణ జాప్యం చేయాలని కోరింది మీరు కాదా? ఆనాడు హరీష్ రావు తనను కాళేశ్వర రావు అని పొగిడించుకున్నారు. ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారు.
కన్నెపల్లి పంప్ హౌసుల నుంచి నీళ్లు వదలాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. దేవాదుల నుంచి నీళ్లు సీతారామ ద్వారా ఖమ్మం రైతులకు అందించాం. సమ్మక్క సారలమ్మ నుంచి దేవాదుల ద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతాంగానికి అందిస్తున్నాం.
కన్నెపల్లి పంపులను ఆన్ చేసి నీళ్లు ఎత్తితే మరి మేడిగడ్డ ఎందుకు కట్టారు? మూడు పంపులు ఏకకాలంలో పనిచేసినప్పుడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతది. మీ కాసుల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కూలింది.. ఈ కరువు కాలంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టుతో ఇవాళ లక్షలాది ఎకరాలకు నీరు అందుతుంది. వాస్తవాలని వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.’
ఈ వేదికగా స్పీకర్‌కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా
‘డిసెంబర్లో ఎల్‌నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై రెండు రోజుల చర్చకు అనుమతివ్వండి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను మొత్తం తెచ్చుకొని నిజాలు బయట పెట్టి తాట తీస్తాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొడంగల్‌కు ఏం చేశారు? కృష్ణా రైల్వే లైన్‌ను అడ్డుకున్నది మీరు కాదా? సిమెంటు ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకున్నారు. సాగు నీరు ఇవ్వలేదు, తాగు నీరు ఇవ్వలేదు.. చదువుకునే అవకాశాలు ఇవ్వలేదు.
మా ప్రభుత్వం ఏర్పడ్డాక మక్తల్–నారాయణపేట ఎత్తిపోత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆనాడు ఎకరానికి పరిహారం 2 లక్షలు కూడా ఇవ్వలేదు.. మా శ్రీహరి రైతులకు ఎకరానికి 20 లక్షలు ఇచ్చారు. కొడంగల్ బాగుపడుతుందని కడుపునిండా విషం పెట్టుకుని అవినీతి జరిగిందని విషం చిమ్ముతున్నారు. మీరు ఇచ్చిన ఈ అవకాశంతో మూడేళ్లల్లో ఇక్కడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ఢిల్లీ నుంచి నోయిడా, ముంబై నుంచి పూణే వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో…
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు అభివృద్ధి చేసి దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతాం. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. తాండూరు పప్పును ప్రపంచంలోని దేశాలకు ఎగుమతి చేసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కొడంగల్ దేశానికే ఒక అభివృద్ధి చెందిన మోడల్‌గా తీర్చిదిద్దుతాం. 10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకోబోతున్నాం.
పదేళ్లు రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందాం. మీకంటే నాకు ఆత్మ బంధువులు ఎవరూ లేరు. అందరికీ రేపు దీపావళి.. కొడంగల్ ప్రజలకు ఇవాళే దీపావళి వచ్చింది. నాకు ప్రజల అభిమానం ఉందని నన్ను చూసి ఒకాయన గడ్డం పెంచుకున్నాడట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన నువ్వు రేవంత్ రెడ్డి కాలేవు. పది జన్మలు ఎత్తినా నువ్వు కేటీఆర్ అవుతావు తప్ప రేవంత్ రెడ్డివి కాలేవు.
రేవంత్ రెడ్డి కావాలంటే కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం ఉండాలి. పిడుగులు మీదపడ్డా నమ్మినవాడి కోసం నిలబడే తెగువ ఉండాలి. ఆయనకు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో. వేషాలు మార్చి.. భాష మార్చినా బుద్ధి రానంత వరకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు.
రైతులకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. ఎల్‌నినో కరువు వస్తుంది.. ఆరుతడి పంటలు వేయండి. ప్రభుత్వం మీ మేలు కోరుతోంది… మీకు అండగా నిలవాలనుకుంటోంది. బావ, బామ్మర్దులు చెప్పే మాటలు వింటే మన్ను పోసి అంబలి కాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మేలు కోరే సోదరుడిగా చెబుతున్నా. జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేయండి. సంక్రాంతి తరువాత ప్రజా బలం కార్యక్రమంతో ప్రతీ గ్రామానికి వచ్చి అందరినీ కలుస్తా. ఎల్‌నినో కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం.’
