హైదరాబాద్, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ‘బిజినెస్ సమ్మిట్-2026’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

సమాఖ్య అనే పదానికి ఎంతో బలం ఉందని, పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం సాగితే, ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం ఎంతో ఉందని సీఎం అన్నారు. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకుని, అందిపుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కొత్త తరం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి పలువురు వివిధ హోదాల్లో రాణించారని, ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచారని సీఎం ప్రశంసించారు. ఈ విజయగాథలను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలని సూచించారు.

2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోనుందని, ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరమని సీఎం చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో కాదని పేర్కొంటూ, అందుకే 2025లో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశామన్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వివరించారు. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. మిగిలిన గ్రామీణ ప్రాంతాలను రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని సీఎం అన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దీన్ని 10 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్‌మార్క్‌గా మారిందని, చార్మినార్ తర్వాత వ్యాపారానికి ల్యాండ్‌మార్క్ హైటెక్ సిటీ అని పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఇప్పటివరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సేవలందించే వైపే ఉన్నారని, ఇకపై మన ప్రాంతానికి చెందినవారు పెట్టుబడులు పెట్టి ప్రపంచస్థాయిలో ఎదగాలని సీఎం పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లకు మహిళలను యజమానులను చేశామని వివరించారు.

సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు తన సూచన ఒక్కటేనని, యువతతో పాటు మహిళలను ప్రోత్సహించాలని సీఎం కోరారు. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని, మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. “మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుంది. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదాం” అని ఆయన పిలుపునిచ్చారు.