హైదరాబాద్‌, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రాజెక్ట్స్‌ విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.

ప్రాజెక్టుల రూపకల్పనలో మెరుగైన సమన్వయం, ఆధునిక నిర్మాణ పద్ధతులు, డిజిటల్‌ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్రణాళికలను వినియోగించడం ద్వారా పనుల వేగం, నాణ్యతను పెంచవచ్చని పేర్కొన్నారు. అయితే పటిష్ఠమైన ఇంజినీరింగ్‌ ప్రమాణాలు, నిర్మాణ నాణ్యత, కార్మికుల భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన తెలంగాణ అర్బన్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌–2026లో ఆయన మాట్లాడారు. తెలంగాణ పురపాలక శాఖ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన అధికారులు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పట్టణాల సమ్మిళిత అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు.

తెలంగాణలో వైద్యం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ప్రజా రవాణా, విద్యుత్తు, సాగునీటి రంగాల్లో ఎంఈఐఎల్‌ పలు ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో భాగస్వామ్యమవుతోందని గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. సనత్‌నగర్‌లో 1,000 పడకల టిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని సంస్థ పూర్తి చేసిందని, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం, నిమ్స్‌ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు 25 ప్రాంతాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

తాగునీటి సరఫరాలో మిషన్‌ భగీరథతోపాటు హైదరాబాద్‌కు గోదావరి జలాల శుద్ధి, సరఫరా వ్యవస్థకు సంబంధించిన పనుల్లోనూ సంస్థ పాలుపంచుకుంటోందన్నారు. నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ)లో భాగంగా రహదారుల నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఓలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, కార్యకలాపాల్లోనూ సంస్థ భాగస్వామ్యమవుతోందని, ఇవి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రజా రవాణాకు దోహదపడతాయని చెప్పారు.

విద్యుత్తు రంగంలో పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణంతోపాటు హైటెక్‌ సిటీలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో 400 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రాజెక్టులోనూ ఎంఈఐఎల్‌ భాగస్వామిగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా చేపడుతోందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.