బేగంపేట (హైదరాబాద్), నవంబర్ 7 (ఎక్స్ప్రెస్ టుడే): ప్రకృతిని పరిరక్షించి, భావితరాలకు పచ్చదనాన్ని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రకాశ్ నగర్లోని ప్రతిష్టాత్మక మాన్సూరా సైబర్ హైస్కూల్లో శనివారం పర్యావరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణ, మొక్కల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మొక్కలను పంపిణీ చేశారు.
ఈ వేడుకలకు ఇండో-కెనడియన్ న్యాయవాది, వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ నూర్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర, జాతీయ చైర్పర్సన్ డాక్టర్ ఎ. జ్యోత్స్న, అడ్వకేట్ జి. లలిత్ కుమార్, డబ్ల్యూఈవో సభ్యులు ఆర్. లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ అడ్వకేట్ మొహమ్మద్ ముదస్సిర్ జుహా, ప్రిన్సిపాల్ ఎం. సుష్మ, మొహమ్మద్ ముజమ్మిల్ జుహా మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. 1935 నుంచి విద్యాసేవలో కొనసాగుతున్న తమ పాఠశాల సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
