హైదరాబాద్, అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు.
‘‘రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదు. ఏ పౌరుడి ఓటు హక్కునూ లాక్కోలేరు’’ అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించి, సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు కూడా జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్నవారికి కవచం కాకూడదని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ కింద భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. సీఈసీ రాజీనామా కోరుతూ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం ఢిల్లీలోనూ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలిపింది.
