బేగంపేట, సెప్టెంబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): స్వాతంత్ర్య పోరాటంలో, దేశ ఐక్యత–సమగ్రతలను కాపాడటంలో హిందీ కీలకపాత్ర పోషించిందని హైదరాబాద్ విమానాశ్రయ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ ఇన్‌చార్జ్) హెచ్.ఎస్. విశ్వాస్ అన్నారు.

ఈ నెల 14న ప్రారంభమైన హిందీ పక్షోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎం హెచ్.ఎస్. విశ్వాస్ మాట్లాడుతూ, అధికారులంతా తమ రోజువారీ కార్యాలయ పనులను సాధ్యమైనంత వరకు హిందీలోనే చేయాలని సూచించారు.

ఎన్‌ఎండీసీ విశ్రాంత డిప్యూటీ జనరల్ మేనేజర్ రుద్రనాథ్ మిశ్రా మాట్లాడుతూ, అన్ని భారతీయ భాషలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో హిందీ భాష అనుసంధాన కర్తగా నిలుస్తోందని అన్నారు.

నోడల్ రాజభాషా అధికారి అపూర్వ జైన్ స్వాగత ఉపన్యాసం చేశారు. నిర్వహించిన వ్యాసరచన, చర్చలు, కవితాలాపన, క్విజ్ తదితర పోటీల వివరాలను వెల్లడించారు. విజేతలకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్చిత్ కుమార్ దత్, డిజీ సాల్వే, నీతా సురేష్ తదితరులు పాల్గొన్నారు.