తిరుమల, సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సమిష్టి కృషితో విజయవంతంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈఓ శ్రీ రవిచంద్ర తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8 రోజుల వ్యవధిలో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా హుండీ కానుకల రూపంలో రూ.28.94 కోట్లు భక్తులు సమర్పించగా, 33 లక్షల లడ్డూలు విక్రయమైనట్లు తెలిపారు. అలాగే 21.84 లక్షల అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయగా, 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు.

గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించినట్లు టీటీడీ చైర్మన్, ఈఓలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు తమ ప్రదర్శనలతో అలరించగా, తొలిసారిగా విదేశీ కళాబృందాలు కూడా ప్రదర్శనలు ఇచ్చాయని వారు వెల్లడించారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల విజయవంతమైన నిర్వహణపై టీటీడీ సిబ్బంది, అధికారులు, పోలీసు యంత్రాంగం సహా అందరి సమిష్టి కృషిని చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈఓ శ్రీ రవిచంద్ర అభినందించారు.