తిరుమల, సెప్టెంబరు 19: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శనివారం నిర్వహించిన అత్యంత వైభవోపేతమైన గరుడ వాహన సేవ భక్తి, కళా వైభవాల సమ్మేళనంగా అలరించింది. గరుడ వాహన సేవను పురస్కరించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు సింగపూర్‌ నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన విభిన్న సాంస్కృతిక కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శాస్త్రీయ, జానపద కళారూపాలతో తిరుమాడ వీధుల్లో సందడి

గరుడ వాహన సేవకు ముందు తిరుమాడ వీధుల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మణిపురి, మోహినీయట్టం, భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, కథక్‌, రాసలీల వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు గోండల్‌, హోలీ, ఘంటా, కరకట్టం, కుడకోతు, బరేది, జిహిజిహియా, డోగ్రీ, కోలాటం, థింసా, కీలుగుర్రాలు, డ్రమ్ములు–లెజుమ్‌ తదితర జానపద, గిరిజన కళారూపాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, ఒడిశా, కర్ణాటక, మణిపూర్‌, బీహార్‌, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాలతో పాటు సింగపూర్‌ నుంచి కళాబృందాలు పాల్గొన్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా సింగపూర్‌ కళాబృందం

సింగపూర్‌ నుంచి పాల్గొన్న కళాకారులు ప్రదర్శించిన సీతారామ కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశీ కళాకారులు భారతీయ ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శించడంతో భక్తులు విశేషంగా ఆనందించారు.

32 కళాబృందాలు.. 916 మంది కళాకారులు

గరుడ వాహన సేవ సందర్భంగా మొత్తం 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వీరిలో హెచ్‌డీపీపీ ఆధ్వర్యంలో 11 బృందాలకు చెందిన 402 మంది, ఏఎన్‌పీ ఆధ్వర్యంలో 7 బృందాలకు చెందిన 193 మంది, డీఎస్‌పీ ఆధ్వర్యంలో 6 బృందాలకు చెందిన 167 మంది, ఎస్‌వీసీఎండీ ఆధ్వర్యంలో 7 బృందాలకు చెందిన 154 మంది కళాకారులు పాల్గొన్నారు. అదనంగా మరో కూచిపూడి కళాబృందం కూడా ప్రదర్శన ఇచ్చింది.

భక్తి.. కళ.. సంస్కృతి.. వైవిధ్యాల సంగమం

శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాల సమ్మేళనంతో తిరుమాడ వీధులు భక్తి, కళా వైభవం, భారతీయ సాంస్కృతిక వైవిధ్యాల సంగమంగా మారాయి. కళాకారుల అద్భుత ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ హర్షధ్వానాలు చేశారు.

శ్రీవారి గరుడ వాహన సేవకు దేశంలోని వివిధ ప్రాంతాల కళారూపాలు మరింత శోభను చేకూర్చగా, కళాకారుల ప్రదర్శనలతో తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వం సాక్షాత్కరించింది.