కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, దీనిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ అవకాశాలు కోల్పోయేలా చేశారని, ఇప్పుడు మళ్లీ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల రక్షణ కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, బీసీల నిధులను మళ్లించిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పామని అన్నారు.
కూటమిలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫేక్ అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. గొడ్డలి పార్టీ విదేశాల్లో టీడీపీ, జనసేన పేరిట ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇలాంటి వాటిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 'దొంగే దొంగ' అన్నట్టుగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలను త్వరలో బయటపెడతామని తెలిసే డీఎస్సీపై దుష్ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్కాం కేసు బనాయించి జైలులో పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ, మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిజం గెలిచిందని ప్రజలు అనూహ్యంగా స్పందించారని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏ నాయకుడైనా ప్రజల తీర్పును గౌరవించాలని, అయితే జగన్ ప్రజా తీర్పును గౌరవించడం లేదని, అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, పైల ముత్యాల నాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సీహెచ్ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
