చెన్నై, నవంబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): దీపావళి పండుగ జరిగే ఆదివారం తమిళనాడులోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) అంచనా వేసింది.

ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, ఈరోడ్, మదురై, దిండిగల్, తెన్‌కాశి, తిరునెల్వేలి జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.