ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు.
వ్యాధులు ప్రబలకుండా హాస్టళ్లు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆమె స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణకు మంత్రి సవిత కీలక ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, విద్యార్థుల యోగక్షేమాలను గమనిస్తూ ఉండాలన్నారు. వేడి, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. బయట ఆహారాన్ని లోపలికి రానివ్వొద్దని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే అందివ్వాలని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వ్యాధులు ప్రబలకముందే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికాగానే సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. పాత భవనాల్లో ఉన్న విద్యార్థులను సురక్షిత భవనాల్లోకి తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని బీసీ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. కూటమిలోని పార్టీలు, నాయకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రెండేళ్ల సీఎం చంద్రబాబునాయుడు పాలనలో బీసీల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని మంత్రి సవిత ఆదేశించారు.
