శ్రీకాకుళం, అక్టోబర్ 19: జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.

శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్న పునేటా, త్వరలో రానున్న స్థానిక పోరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. నామినేషన్ల కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, భద్రతా చర్యలను సమన్వయంతో వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.