శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: ప్రతీ నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వరాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. శనివారం నాడు శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో నిర్వహించారు. వాస్తవానికి ఈ నెల 11వ తేదిన ఉమెన్స్ కళాశాలలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే కలశాల ప్రాంగణాన్ని సందర్శించి.. అపరిశుబ్ర వాతావరణం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్ధినిలు.. ఇలాంటి వాతావరణంలో ఉండటం సరైన పద్ధతి కాదని ఓ వైపు కళాశాల సిబ్బందిని హెచ్చరిస్తూనే.. మున్సిపల్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి పరిశుభ్రతకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ మేరకు.. శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పి మహేశ్వర రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగంతో కలసి ఉమెన్స్ కళాశాల్ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి.. నేరుగా మైదానంలో ఉన్న విద్యార్ధుల వద్దకు చేరుకున్నారు. స్వరాంధ్ర స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞను వారితో చేయించారు.. కళాశాల ప్రాంగణం మొత్తం కలియతిరిగి.. స్వయంగా చెత్తను ఎత్తి విద్యార్ధులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్ధినిలతో ముచ్చటించి.. వారి ఇబ్బందులను, కళాశాలలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో కళాశాల ప్రాంగణంలో అభివృద్ధికి సంబంధించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా జేసిబి ఎక్కి.. చెత్తను తరలించారు. మరో కొద్ది రోజుల్లో అవసరమైన పెద్ద వృక్షాలు మినహా.. మిగిలిన ప్రాంతం అంతా చదును చెయ్యాలని, నీటి నిల్వలు లేకుండా చెయ్యాలని కోరారు. ఇందుకు విద్యార్ధినిలు, అధ్యాపక వర్గం సైతం పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పరిశుబ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.

ఇంకోవైపు కళాశాల ప్రాంగణంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు సైతం జరగకూడదని పోలీసులకు సూచించారు. ఎగ్జిబిషన్, ఇతర వినోద కార్యక్రమాలు కూడా జరగకూడదని, పశువులు ఇతర జంతువులు సైతం కళాశాల ప్రాంగణంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బందికి ఆదేశించారు. మరికొద్ది రోజుల్లోనే మార్పు చెందిన ఉమెన్స్ కళాశాల ను అందరం చూడాలని ఆకాంక్షించారు.

ఇదే సందర్భంలో మున్సిపల్ అధికారులు సిద్ధం చేసిన నగర సేవ యాప్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా శ్రీకాకుళం నగరంలో పరిశుభ్రతకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే.. స్థానికులు నేరుగా ఫిర్యాదు చెయ్యవచ్చని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి.. తమతో వచ్చి.. తమ ఇబ్బందులను అడిగి తెలుసుకుని.. తమ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండటంతో ఉమెన్స్ కళాశాల విద్యార్ధినిలు ఆనందం వ్యక్తం చేశారు. అయన పిలుపు మేరకు కళాశాల పరిశుభ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.