శ్రీకాకుళం, సెప్టెంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం నాడు తన కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షను నిర్వహించారు.
- బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో శ్రీకాకుళంలో భారీ వర్షాల హెచ్చరిక
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష
- సాధారణ పరిస్థితులు వచ్చే వరకు క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం
- వలలు, తీర సామాగ్రిని భద్రపరచుకోవాలని మత్స్యకారులకు సూచన
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తాజా పరిస్థితిని కేంద్ర మంత్రికి కలెక్టర్ వివరించారు. అప్రమత్తంగా ఉండాలని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
మరోవైపు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు కోరారు. వలలు, తీరంలో ఉండే ఇతర సామాగ్రిని భద్రపరుచుకోవాలని సూచించారు. గాలులు వీచే సమయంలో బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలను కోరారు.
