శ్రీకాకుళం, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): నగరంలోని మంగువారి తోట 36, 37 డివిజన్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు గజ్జెల పండుగ, గోరింటాకు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, విద్యారంభం వంటి కార్యక్రమాలు చేపట్టి సందడి చేశారు.

అనంతరం మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిన్నారులకు ముందస్తు పాఠశాల దుస్తులు, ఆహారపు తట్టలు పంపిణీ చేశారు. మెనూ ప్రకారం అందిస్తున్న పౌష్టికాహారం, పోషక విలువలపై అవగాహన కల్పించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పి. నాగరాణి సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల సమగ్ర వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని నాయకులు రోణంకి జ్యోతి కళ్యాణ్, భరణి కుమార్ త్రిలోచన పేర్కొన్నారు.