ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడి పోలీసుల అదుపులోకి వెళ్లి కోర్టు విచారణను ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా యువకులను స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్ని చర్యలు చేపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, సోంపేట మండలాలకు చెందిన నలుగురు యువకులు — చొక్కరు సాయి కుమార్, లండ తరుణ్ కుమార్, చీకటి సాయి వంశీతో పాటు మరొకరు — ఉపాధి కోసం టూరిస్ట్ వీసాపై మలేషియాకు వెళ్లారు. అయితే అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో కొద్ది రోజుల క్రితం మలేషియా పోలీసులు వారిని రైలులో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. టూరిస్ట్ వీసాపై మలేషియాలో ఉద్యోగం ఎలా చేస్తారంటూ ప్రశ్నించిన పోలీసులు, అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర మంత్రి జోక్యం — ఎంబసీతో సంప్రదింపులు
ఈ విషయం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి చేరడంతో, బాధిత యువకుల కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ ద్వారా మలేషియాలోని భారత ఎంబసీతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, నలుగురు యువకుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
ఈ నెల 17వ తేదీన జరగనున్న కోర్టు విచారణ అనంతరం యువకులను స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీరికి ఏజెంట్‌గా వ్యవహరించిన భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఈ వ్యవహారంలో సమన్వయం చేసుకుంటూ, త్వరితగతిన బాధితులు స్వస్థలాలకు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమను స్వస్థలాలకు తీసుకురావడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై బాధిత యువకులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు అండగా నిలిచి, మలేషియా అధికారులతో సమన్వయం చేస్తూ సహాయం అందిస్తున్న రామ్మోహన్ నాయుడుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. ముఖ్యంగా టూరిస్ట్ వీసాతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, వీసా నిబంధనలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లాలని కోరారు. అధిక జీతాలు, తక్కువ సమయంలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాలకు గురికావద్దని, సంబంధిత వీసా, ఉద్యోగ అనుమతులు, సంస్థ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రయాణం చేయాలని హితవు పలికారు.
విదేశాల్లో ఉపాధి అవకాశాల పేరుతో మోసపోకుండా యువత, వారి కుటుంబ సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. మలేషియాలో చిక్కుకున్న సిక్కోలు వాసుల క్షేమ సమాచారం కోసం +60 12-602 0360 నంబర్‌కు సంప్రదించవచ్చని, త్వరలోనే వారిని స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.
