కోటబొమ్మాళి, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలపాలన్న సంకల్పంతో, పల్లె ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న తపనతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి చేస్తున్నారు. ఆయన కృషితో నరసింగపల్లిలో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఈ లక్ష్యాలకు కార్యరూపంగా నిలుస్తోంది.

టెక్కలి డివిజన్, కోటబొమ్మాళి సెక్షన్ పరిధిలోని నరసింగపల్లిలో రూ.3.92 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. మంత్రి ప్రత్యేక కృషితో మంజూరైన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది.

నూతన సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్, 6.13 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 1.92 కిలోమీటర్ల 11 కేవీ లైన్ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు ఒక ఎల్‌వీ వీసీబీ, మూడు ఫీడర్ వీసీబీలు, మూడు 11 కేవీ ఫీడర్లను సమకూర్చనున్నారు. ఈ ఏర్పాట్లు స్థానిక విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడనున్నాయి.

విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. నరసన్నపేట సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక 33 కేవీ ఫీడర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, టెక్కలి, కోటబొమ్మాళి ఫీడర్‌కు నిమ్మాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ట్యాప్ చేసి ప్రత్యామ్నాయ 33 కేవీ ఫీడర్‌ను నిర్మించనున్నారు. ఈ సదుపాయాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు అవకాశం కలగనుంది.

గ్రామాల అభివృద్ధే పునాది అన్న దిశగా అచ్చెన్నాయుడు చేస్తున్న కృషిలో నరసింగపల్లి సబ్‌స్టేషన్ ఒక ముఖ్యమైన ముందడుగు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లోని చిన్నతరహా పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరడంతోపాటు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందేందుకు అవకాశం ఉంటుంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.

గడువులోగా సబ్‌స్టేషన్ నిర్మాణం

మూడు నుంచి నాలుగు నెలల కాలవ్యవధిలో ఈ నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తికానుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి, సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.