శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 రకాల డిప్లొమా కోర్సుల్లో ఖాళీ సీట్లకు అక్టోబర్ 6 నుంచి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ

శ్రీకాకుళం, అక్టోబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పరిధిలోని 12 రకాల డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న 175 సీట్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

వైద్య రంగానికి అనుబంధంగా ఉండే ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు అక్టోబర్ 6 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

కోర్సుల పూర్తి వివరాలు, సీట్ల విభజన, దరఖాస్తు విధానం, అవసరమైన అర్హతల సమాచారాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు సమయాన్ని వృథా చేయకుండా గడువులోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి సందేహాలు ఉంటే కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని ప్రకటనలో వివరించారు.