అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి (94) చెన్నైలో గురువారం కన్నుమూశారు. వయోభారజనిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, "అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి గారి ఆకస్మిక మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరం అయినా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.
"షావుకారు జానకి గారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను" అని సీఎం తన సంతాప సందేశంలో తెలిపారు.
1950లో వచ్చిన "షావుకారు" చిత్రంతో ఈ పేరు సంపాదించిన జానకి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఏడు దశాబ్దాలకు పైగా నటించారు. 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
