గురువారం నాటి ర్యాలీ తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 3.11 పాయింట్లు (0.00%) పెరిగి 77,540.83 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20.15 పాయింట్లు (0.08%) పెరిగి 24,252 వద్ద స్థిరపడ్డాయి.

మెటల్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరగగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా, ఫార్మా షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి. క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగడం, అంతర్జాతీయ బాండ్ల రాబడులు పెరగడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.

వారం మొత్తంగా చూస్తే నిఫ్టీ 0.5%, సెన్సెక్స్ 0.6% మేర క్షీణించాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 94 డాలర్ల సమీపంలో కొనసాగుతుండటం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.

మారుతీ సుజుకీ, ట్రెంట్, ఇండిగో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్లుగా నిలిచాయి. వచ్చే వారం క్రూడాయిల్ ధరల కదలికలు, అంతర్జాతీయ పరిణామాలపైనే మార్కెట్ దిశ ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.