రాయలసీమను సీఎం చంద్రబాబునాయుడు సస్యశ్యామలం చేస్తున్నారని, ఆయన హయాంలోనే సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

రెండేళ్లలో హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 50 టీఎంసీల కృష్ణా జలాలను తరలించామని మంత్రి సవిత తెలిపారు. వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.2,011 కోట్లే ఖర్చు చేశారని, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.12,500 కోట్లు వెచ్చించిందని ఆమె గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదని, ఆనాడే జగన్‌ను వైసీపీ నేతలు ఎందుకు నిలదీయలేదని ఆమె ప్రశ్నించారు.

టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారని, అన్న ఎన్టీఆర్ తెలుగు గంగ, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.6,600 కోట్లకుపైగా ఖర్చు చేశామని, ఈ కాలంలో హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని తెలిపారు.

19 నియోజకవర్గాల్లో ఉన్న 420 చెరువులను నీటితో నింపామని మంత్రి సవిత తెలిపారు. తుంగభద్ర (టీబీ) డ్యామ్ ఆధునీకీకరణ, క్రస్ట్ గేట్ల మార్పిడికి రూ.35 కోట్లు వెచ్చించామని, రూ.750 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా శ్రీకారం చుట్టామని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు.

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సాగు, తాగునీరందించడానికి తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గానికి 2014-19 మధ్య సీఎం చంద్రబాబునాయుడు సాగునీరందించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివెందులకు తాగునీరందించడానికి రూ.480 కోట్ల జలజీవన్ మిషన్ నిధులతో మెగా వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. వచ్చే నెలలో ఈ నిర్మాణం పూర్తి కానుందని, దీనితో 24 గంటలూ పులివెందులకు తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పులివెందులకు సాగు, తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత వెల్లడించారు.