బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒక బహిరంగసభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు తానే స్వయంగా సవాలు విసురుతున్నానని, పార్టీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీట్ల సంఖ్య పెరిగితే 117కు చేరుకుంటామని, ప్రస్తుత సీట్లే మిగిలినా 90 సీట్లతో గెలుస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయ చరిత్రను ప్రస్తావించిన సీఎం
1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు అధికారంలో ఉందని, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలో ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలో ఉందని, ఇప్పుడు 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలో ఉంటుందని అంచనా వేశారు. ఈ కాలంలో ప్రజా సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్కు పిలుపునిచ్చిన సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని, రానున్న ఎన్నికల్లో అదే స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ 2028లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుంది.
