తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై మండిపడిన ఆయన, రాష్ట్రంపై గుజరాత్ ఆధిపత్యాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
- తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- మోదీ గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శ
- డిసెంబర్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామని ప్రకటన
- రాజకీయ కారణంతోనే అనుమతి నిరాకరించినట్లు విదేశాంగ శాఖ బదులిచ్చిందని వెల్లడి
లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే ఎన్నో దేశాల్లో పర్యటించారని, ఆయన సొంత రాష్ట్ర సీఎం కూడా ఎన్నో దేశాల్లో పర్యటించారని, గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ఆసక్తి చూపించాయని, తమ యూనివర్సిటీలతో ఒప్పందానికి విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపాయని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రఖ్యాత వర్సిటీలతో ఎంవోయూలు చేసుకునేందుకే తాను అమెరికా పర్యటన తలపెట్టినట్లు తెలిపారు. విదేశీ వర్సిటీలు తమ వద్దకు వస్తే, తమ విద్యార్థులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. డిసెంబర్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామని, హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తామని స్పష్టం చేశారు. తన విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదని, మొత్తం షెడ్యూల్‌ను విదేశాంగ శాఖ ముందుంచామని తెలిపారు.
ప్రధాని మోదీ గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని, భారత్‌కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్ రాష్ట్రానికే రావాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తన పర్యటనను అడ్డుకోవడం గురించి పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రకటించారు. యూకే, యూఎస్ పర్యటనలకు ఒకే తరహా వివరాలు ఇచ్చామని, లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనను మాత్రం ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాజకీయ కారణంతోనే అనుమతి ఇవ్వటం లేదని విదేశాంగ శాఖ బదులిచ్చిందని, తాను తెలంగాణ సీఎం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావటమే ఆ రాజకీయ కారణమా అని నిలదీశారు.
"వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారు. పెట్టుబడుల కోసం గుజరాత్ సీఎం అమెరికాలో 8 రోజులు పర్యటించారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి, తెలంగాణ సీఎంను ఎందుకు అడ్డుకున్నారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని కేంద్రం, మోదీ పదేపదే ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించుకునేందుకు కుట్ర చేశారు. నన్ను అడ్డుకోవటం, గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనం. రాజకీయ వివక్షతో తెలంగాణను మోదీ అడ్డుకుంటున్నారు" అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరెత్తకపోవటం మరింత అవమానమని ఆయన అన్నారు.
కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నేతలు తన అధికార పర్యటనపై అవాస్తవాలు చెప్పి కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. విదేశీ పర్యటనకు దరఖాస్తు చేసినప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా పేర్కొన్నామని, అమెరికాలో ప్రఖ్యాత వర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని చెప్పామని తెలిపారు. అయినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని విదేశాంగ శాఖ బదులిచ్చిందని వెల్లడించారు.
