బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాంటివని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశాయా అని ప్రశ్నించారు. తాను మాత్రం వందలాది ఎకరాల్లో వరి పండిస్తూ, రూ.500 బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొంటున్నామని, తాను రైతుబంధువును తప్ప రైతును బంద్ చేయలేదని అన్నారు.
37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశామని, రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం మృగ్యమైందని, తమ ప్రభుత్వం మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ తెలంగాణను ముందు వరుసలో నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
