గిరిజన సమాజాన్ని 'ఆదివాసీలు' అని పిలవాలే తప్ప 'వనవాసులు' అని కాదని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు.

'ఆదివాసీ' అనే పదం గిరిజనులు దేశానికి తొలి యజమానులని, జల్, జంగల్, జమీన్‌లపై వారికి హక్కు ఉందని సూచిస్తుందని, అయితే 'వనవాసి' అనే పదం వారిని కేవలం అడవుల్లో నివసించే వారిగా చిత్రీకరించే ప్రయత్నమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గిరిజన గుర్తింపును బలహీనపరిచేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుతున్నాయని ఆరోపించారు.

నాసిక్ గిరిజన విద్యార్థులకు మద్దతు

ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌లో హాస్టళ్లు, భోజన సదుపాయాలు, ఇతర సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టిన గిరిజన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని రాహుల్ గాంధీ కలిశారు. వారి పోరాటం కేవలం విద్య, ఉద్యోగాల కోసమే కాదని, తమ ఉనికి, ఆదివాసీ గుర్తింపు కోసం కూడా అని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ, తానూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆదివాసీలను వనవాసులుగా పిలవడం రాజ్యాంగంపై, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాపై దాడి వంటిదని గతంలో పలు సభల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గిరిజనులకు అధికారంలో, సంపదలో వాటా దక్కాలంటే కుల గణన అత్యవసరమని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ 'డివైడ్ అండ్ రూల్' రాజకీయాలుగా అభివర్ణిస్తూ తీవ్రంగా తప్పుబట్టింది.