కొత్తగా అమల్లోకి వచ్చిన జియో ఫెన్సింగ్ మీటర్ రీడింగ్ విధానంలో సాంకేతిక లోపాలతో సకాలంలో బిల్లులు నమోదు కాక వినియోగదారులపై భారం పడుతోంది.

గతంలో రోజుకు సుమారు 300 సర్వీసుల వరకు మీటర్లు స్కాన్ చేసి బిల్లులు ఇచ్చే రీడర్లు, కొత్త వెర్షన్ సాఫ్ట్‌వేర్ వచ్చిన తర్వాత 100 బిల్లులు కూడా నమోదు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మీటర్ వద్దకు వెళ్లినా జియో ఫెన్సింగ్ సరిగా పనిచేయక రీడింగ్ నమోదు కావడం లేదని చెబుతున్నారు.

దీంతో నిర్ణీత గడువులోగా బిల్లింగ్ పూర్తి చేయడం కష్టంగా మారింది. బిల్లింగ్ ఆలస్యమైతే వినియోగం అధిక స్లాబులోకి వెళ్లి, వినియోగదారుడిపై అదనపు భారం పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెలా 12వ తేదీలోగా రీడింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, సాఫ్ట్‌వేర్ సమస్యలతో ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదని సిబ్బంది తెలిపారు.